నోరుజారిన బాబు..తెలంగాణలో టీడీపీ పరువు పాయే

తెలంగాణలో టీడీపీని మళ్లీ పొలిటికల్ ట్రాక్ లోకి తేవడంపై దృష్టి సారించిన చంద్రబాబు… ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ టీడీపీలో పెను దుమారం రేపాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోడం ప్రారంభించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. దుమారం రెపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ 11వ శతాబ్దం నాటికే వరి పండించిందని, హైదరాబాదు నగరం 15వ శతాబ్దం నాటికే దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారని… ఆ నీటిపారుదల కింద వరి, గోధుమలు, కొర్రలు, పెసలు, అల్లం, చెరుకు, ఉల్లి, జొన్నలు, పసుపు పంటలు పండించారని వివరించారు. చంద్రబాబు ఇవన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుది అవగాహనరాహిత్యమే కాకుండా, అహంకారంతో కూడిన ధోరణి అని విమర్శించారు. చరిత్ర తెలియని వారు ఈ ప్రాంత ముఖ్యమంత్రులుగా పనిచేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మరి మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లుగా చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తారో లేదో చూడాలి.