స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా కొనసాగుతోంది. 9 స్థానాల్లో ఏకంగా ఐదు స్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కుడిపూడి సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సిఫాయి సుబ్రహ్మణ్యం. అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను పోటీ లేకుండానే వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది.
ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు టీడీపీ మద్దతుదారులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. అయితే, వారి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడం, ప్రతిపాదితుల సంతకాలు ఫోర్జరీవి కావడం తదితర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో మిగిలారు. రాష్ట్రంలో మొత్తంం 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. 16న కౌంటింగ్ జరగనుంది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు .. 5 స్థానాలు ఏకగ్రీవం కావడంతో.. మరో నాలుగు స్థానాలకు… 3 పట్టభద్రులకు.. 2 టీచర్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కూడా దాదాపు వైసీపీనే విజయం సాధిస్తుందని.. పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు