ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో రెండు, ఉత్తరాంధ్రలో ఒక చోట పట్టభద్రులు, అలాగే రాయలసీమలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ మందే బరిలో ఉన్నారు.
సహజంగా వీటిలో వామపక్ష పార్టీల అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చేవారు. ప్రధాన రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను పోటీ నిలిపేవి కావు. ఎందుకంటే ఉద్యోగులతో గొడవ పెట్టుకోవడం ఎందుకనే ధోరణి ఇంత కాలం వుండేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని కూడా ప్రత్యర్థులుగా చూస్తుండడంతో ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి.ప్రధానంగా ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరుగుతుండడంతో ఈ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. దీంతో ఎన్నికలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని నేతలను ఆయన ఆదేశిస్తున్నారు. గెలుపు కోసం ఏం చేయాలో ఆ పనులన్నీ చక్కబెట్టాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. రేపటి నుంచి ఆ పనుల్లో నాయకులు మరింతగా నిమగ్నం కానున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి మరొక చిక్కొచ్చి పడింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి సిద్దం అయ్యారు. మరి ఈ ఉద్యమం గనుక జరిగితే..ఈ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అమరి ఈ విషయంలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.