చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను సీఐడీ విచారించింది. ఆయన ఇళ్ళల్లో సోదాలు కూడా నిర్వహించింది. సీమెన్స్ కంపెనీతో ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసులో అప్పట్లో ఏపీ ఎస్ఎస్డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నేపధ్యంలోనే.. వైసీపీ నాయకులు పలు రకాల విమర్శలకు దిగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సూత్రధారి నారా లోకేష్ అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. సిమెంట్స్ కంపెనీతో డమ్మీ ఒప్పందం చేసుకుని రూ. 300 కోట్లు ప్రజాధనం మింగేశారని ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు.
సెల్ కంపెనీల ద్వారా ఈ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తే సీమెన్స్ కంపెనీ 90శాతం నిధులు వెచ్చించి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 371 కోట్లు చెల్లించేశారు. వాటిలో 245 కోట్లను డిజైన్ టెక్, స్కిల్లర్ అనే షెల్ కంపెనీల ద్వారా సింగపూర్ కు మళ్లించి, వాటిని మళ్లీ టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారని అంటున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశే ఏపీ ఎస్ఎస్ఓసీ వ్యవహారాలు చూడటం గమనార్హం. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు నెలకొంటాయో చూడాలి.