టీడీపీకి రాజకీయ భవిష్యత్ కావాలన్నా.. తిరిగి అధికారంలోకి రావాలన్నా.. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని అందరూ చెప్పే మాట. చంద్రబాబు పర్యటనల్లో జూఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న జెండాలు దర్శనమిచ్చాయి. ఎన్టీఆర్ సీఏం అంటూ అభిమానుల నినాదాలు హోరెత్తాయి. అది బాబుగారికి ఏ మాత్రం రుచించలేదనుకోండి. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సమావేశం ఖరారు అయింది. అందునా కుప్పం వేదికగా ఈ భేటీ జరగనుంది..కీలక నిర్ణయం దిశగా సమావేశం అవుతున్నారని సమాచారం.
ఇదే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. మీట్ అండ్ గ్రీట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా కుప్పంలో ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమావేశం పైన ఆసక్తి పెరుగుతోంది. ఈ సమావేశంలో అభిమానులు ఏ తీర్మానం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. ఆ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా కీలక నిర్ణయం ప్రకటన దిశగానే ఈ సమావేశం జరుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి.
గతంలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలోనే జూ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకు మద్దతుగా నినాదాలు చేసారు. జూ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్ చేసారు. ఆ తరువాత రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే రకమైన డిమాండ్లు వినిపించాయి. కానీ, చంద్రబాబు స్పందించలేదు. ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఈ సమావేశంలో రాజకీయంగానే చర్చ ఉంటుందనే అభిప్రాయం బలపడుతోంది. చూడాలిమరి ఈ విషయంలో ఏం జరగబోతుందో అనేది.