మంత్రి రోజాకు అరుదైన గౌరవం

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది. ఏపీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాకు స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జతిన్ నర్వాల్ మంత్రికి లేఖ రాశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతారు. కార్యవర్గంలో సభ్యులుగా ఏపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులకు కూడా కేంద్రం చోటు కల్పించింది.

సాయ్ లో తనకు సభ్యత్వం లభించడంపై రోజా స్పందించారు. అరుదైన అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని పేర్కొన్నారు. రోజా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పర్యాటకశాఖతోపాటు క్రీడలశాఖను కూడా పర్యవేక్షిస్తున్న రోజా పాఠశాల స్థాయిలో విద్యార్థులను ఆటలాడించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తాను కూడా ఆ క్రీడలను ఆడటమే కాకుండా విద్యార్థినులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటూ.. విధ్యార్ధులలో కూడా ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజా రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.