వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకి సీటు దక్కడం కష్టమేనా..? నాడు ఆమె చేసిన తప్పిదాలే.. నేడు ఆమె రాజకీయ భవిష్యత్ కి భంగం గలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. భూమా ఫ్యామిలీకి రాజకీయాలలో ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అంత సీన్ లేదని అర్ధమయ్యింది. భూమా అఖిలప్రియ మరోసారి ఆళ్లగడ్డ నుంచి మరోసారి టికెట్ ఆశిస్తుండగా.. ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇక్కడి నుంచే టికెట్ కోరుతున్నారు. ఇప్పుడు ఆళ్లగడ్డలో తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సుబ్బారెడ్డి గట్టిగా కోరుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అఖిలప్రియ క్యాడర్‌తో అస్సలు టచ్‌లో లేరని, ఆమె అప్పుల్లో ఉన్నారని, ఎన్నికల్లో నిలబడడానికి కావాల్సిన డబ్బు కూడా ఆమె దగ్గర లేదని సుబ్బారెడ్డి టీడీపీ పెద్దలకు చెప్పినట్లుగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని.. అందుకే తనకు టికెట్ ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారట. అయితే.. ఏవీ సుబ్బారెడ్డి, బోండా ఉమా వియ్యంకులు. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ టికెట్ ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారట. ఈ మేరకు చంద్రబాబుతో కూడా ఉమా చర్చించారట. ఇక ఆళ్లగడ్డలో చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డి పేరు ప్రకటిస్తే.. అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడినట్టేనని అక్కడి నాయకులు అంటున్నారు. అయితే.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరో పేరు కూడా వినిపిస్తోంది. అఖిల పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కిశోర్ రెడ్డి బీజేపీ ఇంచార్జిగా ఉన్నారు. టికెట్ కన్ఫర్మయితే టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని భావిస్తున్నారట. మరి చివరకు అల్లగడ్డ టిడిపి టికెట్ ఎవర్ని వరిస్తుందో చూడాలి.