లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పుడే అందిన సమాచారం మేరకు లోకేశ్ పాదయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠత నెలకొంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ గండం వాటిల్లింది. ఈ నేపధ్యంలోనే.. లోకేశ్ పాదయాత్ర విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌ లేఖ రాశారు. పాదయాత్ర ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తుందో లేదో చెప్పాలని లేఖలో కోరారు.

మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడంతో.. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన కొనసాగుతుంది. ఇటు నారా లోకేష్ లోకేష్ కూడా పాదయాత్రలో కొన్ని హామీలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం వస్తే మంచి చేస్తామంటూ పలు హామీలు ప్రకటిస్తున్నారు. ఇదీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని అధికారులు అంటున్నారని.. అందుకే సీఈవో నుంచి స్పష్టత కోరుతూ కలెక్టర్ లేఖ రాశారు. దీంతోపాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు అనుమతి విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈసీని కోరారు. మరి ఈసీ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.