జగన్ సర్కారుకు ఊరట సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గిన అమరావతి రైతులు

ఏపీ రాజధాని అమరావతి భూముల విషయంలో ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
రాజధానిలో గతంలో సేకరించిన భూముల్ని ఇతర ప్రాంతాలు, జిల్లాల వారికి కూడా ఇళ్ల స్ధలాల కోసం కేటాయించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. దీనికి సంబందించిన కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా పిటిషనర్లకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు కూడా వేసింది. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు …దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని సుప్రీం కోర్టు రైతుల్ని అడిగిందని ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుండటంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆర్-5 జోన్‌పై పిటిషన్‌ను అమరావతి రైతులు వెనక్కి తీసుకున్నారు. ఆర్‌-5 జోన్‌ అంశంపై ఈనెల 19న హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సుప్రీంలో వేసిన పిటిషన్‌‌ను రైతులు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సుప్రీంకోర్టు కూడా అనుమతించింది. ఆర్‌ 5 జోన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై 19న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ జరపనుంది.