అక్రమ వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.155 బీఎస్-3 వాహనాలకు బీఎస్-4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు వీరిని ఇంకా వెంటాడుతోంది. మార్చి 1వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ జేసీ బ్రదర్స్ తో సహా మరో 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లను పంపింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. తప్పుడు పత్రాలతో 155 వాహనాలను రిజిస్టర్ చేయించారని జేసీపై పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రాజకీయ కక్షల్లో భాగంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అప్పట్లో జేసీ ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి 2020 జూన్ 13న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు ఈ కేసును ఈడీ కూడా విచారిస్తోంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేశారని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 7న జేసీని ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటల సేపు విచారించారు. గడువు తీరిన వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని అభియోగాలు మోపారు.