వివేకా కేసులో మరో ట్విస్ట్

వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ కేసుకు సంబందించి మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి‌పై దాడి, బెదిరింపుల ఘటనలో సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వరరెడ్డి, ఆయన కొడుకు సునీల్‌కుమార్‌రెడ్డిలకు జమ్మలమడుగు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వివేకా హత్యను జీర్ణించుకోలేకపోయామని, ఉమాశంకర్‌రెడ్డిపై ఏర్పడిన కోపంతోనే ఆయన భార్యపై దాడికి యత్నించినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. తన భర్త ఉమాశంకర్ రెడ్డిని, తనను చంపేస్తామని కొమ్మా పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి తెలిపారు.

ఈ విషయాలు చెప్పాలంటే కూడా తనకు భయంగా ఉందని స్వాతి చెప్పారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. వివేకాను చంపేసి ప్రశాంతంగా కూర్చున్నారా? అంటూ తన గొంతు నులిమి చెప్పుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరమేశ్వరరెడ్డి, సునీల్ కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివేకా హత్యను జీర్ణించుకోలేకపోయామని, ఉమాశంకర్‌రెడ్డిపై ఏర్పడిన కోపంతోనే ఆయన భార్యపై దాడికి యత్నించినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. నిన్న వారికి జమ్మలమడుగు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు పోలీసులు వివరించారు.