పార్టీ అధిష్టానం ఆయనకు ఇచ్చిన షాక్ ఏంటి..? టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా..? ఆయన చూపు వైసీపీ వైపు మళ్ళిందా..? అన్న పలు రకాల ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన టీడీపీని వదిలే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేశానని.. చంద్రబాబు తనకు ఇంత అన్యాయం చేస్తారని ఊహించలేదని కృష్ణుడు నియోజకవర్గ నేతలతో చెప్పుకుని బాధపడుతున్నారట. తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికొస్తే.. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా తుని నుంచి యనమల కృష్ణుడుని పక్కనపెట్టారు. తుని నియోజకవర్గ ఇంచార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను చంద్రబాబు నియమించారు. దీంతో యనమల కృష్ణుడు వైసీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ నేతలు సైతం ఆయనతో టచ్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది.
నిజానికి పార్టీలో రెండుసార్లు ఓటమి పాలయిన సీనియర్లకు నో టికెట్ అని అధిష్టానం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికలు 2014 2019ల్లో తుని నుంచి యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు. ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు. సొ.. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. యువతకు 50% అవకాశం కల్పిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ప్రస్తుతం తుని నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజాను ఓడించడానికి టీడీపీ యనమల దివ్యను బరిలో దించుతోంది. యనమల కృష్ణుడుని తప్పించి తన అన్న కూతురికి ఇంచార్జ్ గా నియమించడంతో కృష్ణుడు నిరాశ చెందారట. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో అనేది.