పెనుమలూరులో ఉద్రిక్తత పవన్ కల్యాణ్ కి అవమానం

నేడు జరగబోతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాగంగా ఏపీ రాజకీయాలలో మరింత హీటు రాజుకుంది. ఇప్పటికే ఈ సభకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వారాహి వాహనం వెనుక జనసైనికులు ర్యాలీగా రావాలాని జనసైనికుల నిర్ణయానికి పోలీసులు బ్రేక్ ఇచ్చారు. ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. ఏఎ నేపధ్యంలోనే కృష్ణా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంది. ఇన్ని పరిణామాల నడుమ.. పెనుమలూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సిలను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. వారాహి వాహనంలో వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతూ పెనమలూరు నియోజకవర్గం తాడిగడప జంక్షన్ లో స్థానిక నాయకులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. అయితే ఈ కటౌట్లను గుర్తుతెలియని దుండగులు చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలావుంటే విజయవాడలోని ఆటోనగర్ నుండి ప్రచారరథం వారాహిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మచిలీపట్నం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి తాడిగడప, పోరంకి, పెనమలూరు, పామర్రు–గుడివాడ, గూడూరు సెంటర్ల మీదుగా వారాహి యాత్ర సాగి సాయంత్రం 5గంటలకు మచిలీపట్నంలోని పార్టీ ఆవిర్భావ సభా వేదికకు చేరుకోనుంది. ఇప్పటికే ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమ అభిమాన నాయకుడు మచిలీపట్నం వస్తున్న తరుణంలో పవన్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఘర్షణలు సంభవించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.