అధికార,ప్రతిపక్షాలు ఎన్నికల రణ రంగానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే.. పార్టీ అధినాయకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రతిరోజూ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే.. ప్రస్తుతం అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకంటే నాకంటూ ప్రచారం చేఉకుంటూ పోతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో సీట్లు మార్పుపై వస్తున్న ప్రకటనలు సరికాదని తేల్చిచెప్పారు.
పెద్దాపురం నుండి ప్రస్తుతం హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్గా ఉన్న దవులూరి దొరబాబుకే సీటు కేటాయించినట్లు తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు పోటి చేస్తారన్నారు. మిథున్ రెడ్డి టిక్కెట్లపై స్పష్టత ఇవ్వడంతో అటు రామచంద్రాపురంలో, ఇటు పెద్దాపురంలో కార్యకర్తలకు ఓ క్లారిటీ వచ్చినట్లైయింది. అయితే ఎన్నికల నాటికి ఏదైనా మార్పులు పార్టీ తీసుకుంటే తప్పితే, దాదాపుగా మిథున్ రెడ్డి నోటి వెంట వచ్చిన పేర్లే ఖరారవుతాయని వైసీపీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. అయితే.. కష్టపడే వారికే టికెట్ అంటూ.. సిఎం జగన్ ముందుగానే చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరైతే పార్టీకి మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారో, పార్టీ కోసం పని చేయకుండా కాలయాపన చేస్తున్నారో వారికి టికెట్ లేదని సిఎం జగన్ నిర్మొహమాటంగా చెప్పేశారు. మరి చివరి దశలో ఎవరికి టికెట్ వరిస్తుందో చూడాలి.