టిడిపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిడిపిలో ఉన్న సీనియర్లు వరుసగా పార్టీని వీడి చంద్రబాబుకి షాకుల మీద షాకులు ఇస్తుంటే.. బాబుకి ఇప్పుడు మరో గట్టి షాక్ తగిలింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఓడిపోయిన సీనియర్లకు నో టికెట్ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ.. పాపం బాబుమీద సీనియర్ నేతలు కక్ష్య కట్టినట్టున్నారు. చంద్రబాబు ఎవర్ని అయితే నమ్ముతున్నారో వారే వెన్నుపోటు పొడుస్తున్నారని.. ఆ పార్టీలో ఉన్న నాయకులే బహిరంగంగా చెప్పడం చాలా ఆశ్చర్యం అని చెప్పాలి. అసలు విషయానికొస్తే.. చింతకాయల అయ్యన్నపాత్రుడు పక్కా నాన్ లోకల్ అని అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు చెబుతున్నారు. ఎక్కడ నుంచో వలస వచ్చి ఉత్తరాంధ్రలో పెత్తనం చెలాయిస్తారా అంటూ.. మరో టిడిపి నేత చెప్పడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగానే భావించాలి.
టీడీపీ నేత ఈర్లె శ్రీరామమూర్తి అయ్యన్నపాత్రుడుపై ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో తన కులానికి చెందిన నాయకులను ఎదగనీయకుండా అయ్యన్న కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. పార్టీ కోసం తాను పడ్డ కష్టం అంతా అయ్యన్నపాత్రుడు బుగ్గిపాలు చేశారని ఈర్లె శ్రీరామమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వివాదానికి గల కారణం ఏంటంటే.. పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలోనే.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్టు ఈర్లె శ్రీరామమూర్తి స్పష్టం చేశారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆర్టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలోనూ అయ్యన్నపాత్రుడు అడ్డు తగిలారని ఆరోపించారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ సమయంలో సొంత పార్టీ నేత రెబల్‌గా పోటీ చేయడం ద్వారా వైసీపీకి ప్లస్ అని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. చివరకు ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారక మునుపే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.