తాజాగా ఏపీకి వచ్చిన అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలే ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి. అదే రీతిలో అమిత్ షా, నడ్డాకి వైసీపీ లీడర్లు కౌంటర్లు ఇస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చేయించుకుంటోన్నారు. ఇటీవలే ఏపీకి 10,461 కోట్ల రూపాయలను విడుదలను మంజూరు చేసిన విషయం తెలిసిందే.అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,911 కోట్ల రూపాయలను సైతం యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. గోదావరిలో వరదల కారణంగా కాఫర్‌డ్యామ్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా 2,000 కోట్ల రూపాయలను సైతం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. ఈ 2,000 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఏపీకి కేంద్రం కనకవర్షాన్ని కురిపిస్తోంది. మరో 4,787 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను పంపిణీలో భాగంగా మూడవ విడత కింద కేంద్రం ఈ నిధులను విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 4,787 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.