జగన్ సర్కార్‌కు కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. రెవెన్యూ లోటు బడ్జెట్, పోలవరం ప్రాజెక్ట్ నిధులను మంజూరు చేసిన కేంద్రం- తాజాగా ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్రానికి మంజూరు చేసింది కేంద్రం. ఇది తిరుపతిలో ఏర్పాటు కానుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసులకు కేంద్రం అనుమతి తెలిపింది. పరిపాలన అనుమతులను కూడా జారీ చేసింది. తొలిదశలో 6 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. తిరుపతిలో ఈ సెంటర్‌ను నెలకొల్పాలంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక లోక్‌సభ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి కొంతకాలంగా ప్రయత్నాలు సాగించారు. ఎట్టకేలకు అవి ఫలించాయి. ఎలక్ట్రానిక్స్ డిజైన్, టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి రాష్ట్ర విద్యార్థులకు ఇది దోహదపడుతుందని గురుమూర్తి వ్యాఖ్యానించారు. ఇక ఇదే క్రమంలో ఏపీకి కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఐదు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటుకు ఆమోదం లభించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ప్రారంభం కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.