పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎట్టకేలకే కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు మోక్షం కలిగిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు పార్లమెంట్ లో ఆమె హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల అంశాన్ని మచిలీపట్నం సభ్యుడు వల్లభనేని బాల శౌరి సభలో ప్రస్తావించారు. సకాలంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బకాయిలు, పరిహారాల మొత్తాన్ని విడుదల చేయట్లేదని, ఫలితంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నామని అన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు.
ఏపీకి మొత్తంగా విడుదల చేయాల్సిన నిధులు 1,268 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని అన్నారు. ఆ నిధుల విడుదలలో ఇప్పటికీ జాప్యం చేసుకుంటోందని వల్లభనేని బాల శౌరి చెప్పగా.. నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. 689 కోట్ల రూపాయలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.