ఏపీ సీఐడీ మాజీ చీఫ్ కి కేంద్రం షాక్, జగన్ సర్కార్ వేటుకు రంగం సిద్దం..?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాదు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. తమకు నివేదిక సమర్పించాలని కూడా కోరింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఒక వేదక ఏర్పాటు చేసిన సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కూడా విపక్షాలపై కొన్ని కేసులు పెట్టినట్లు చెబుతున్నారు. పైగా ఆయన తరచూ అమెరికా వెళ్లివస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారం చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను బదలీ చేసింది.

సాధారణ పరిపాలనా శాఖ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తనకు డీజీపీ పదవి ఇవ్వబోతున్నారని సునీల్ కుమార్ సంబరపడిపోయినా ఇంతవరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు సునీల్ పై చర్యలకు కేంద్రం ఆదేశించడంతో, ఆ సంగతి ముందే పసిగట్టి బదిలీ చేశారని భావించాల్సి వస్తోంది. 2020లో భారత రాజ్యాంగ దినోత్సవం నాడు సునీల్ కుమార్ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందూ మతాన్ని మరియు వేదాలు మరియు పురాణాల వంటి పవిత్ర గ్రంథాలను దూషించారనేది ఆయనపై అభియోగం.

అదేసమయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏకంగా.. సదరు వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆధారాలను కూడా లేఖకు జతపరిచారు. సునీల్కుమార్ “అంబేద్కర్స్ ఇండియా మిషన్” పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారని హిందువులకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు విభజన మత/కుల ఆధారిత రాజకీయాలకు తెరదీశారని రఘురామ ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగానే కేంద్రం చర్యలకు ఆదేశించినట్లు చెబుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.