ఏపీ రాజకీయాలలో లెక్కలు మామూలుగా మార్పు చెందటంలేదు. పంతం నీదా నాదా సై.. అంటూ రాజకీయ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. వచ్చే ఎన్నికలతో ఏ పార్టీ భవిష్యత్ ఏంటో తేలిపోనుంది. వచ్చే ఎన్నికలలోపు మమ్మల్ని వేసెయ్యండి.. లేదంటే ఆ తర్వాత మేము చేసేది చేస్తాం అంటూ ఆల్రెడీ బుద్దా వెంకన్న బహిరంగంగానే సవాల్ చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే.. టిడిపిని గెలుపు గుర్రం ఎక్కించాలని.. ఓ వైపు చంద్రబాబు సభలు సమావేశాలు, మరోవైపు లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న కొన్ని కీలక నియోజకవర్గాలలో టిడిపి జెండా ఎగురవేయాలని.. టిడిపి కసరత్తులు స్టార్ట్ చేసింది. గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి గెలుపొందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. బాబుపై తిరుగుబాటు మొదలెట్టి ఆయనకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీని ఎలాగైనా ఓడించాలని బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయనే కాదు టిడిపిలో ఉన్న కొందరు నాయకులు కూడా అదే పట్టు పడుతున్నారు. తాజాగా గన్నవరంలో జరిగిన రగడతో.. చంద్రబాబు మరింత సవాల్ గా తీసుకున్నారు. వంశీని ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో.. పట్టు విడువని విక్రమార్కుడిలా.. గన్నవరం ఎపిసోడ్ తర్వాత ఆ నియోజకవర్గంలో తమ నాయకులతో తాజాగా ఓ సమావేశం ఏర్పాటు చేసి.. అసలు గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్న దానిపై ఆరా తీశారట.
గన్నవరం నియోజకవర్గం టిడిపికి బలమైన కంచుకోట. వల్లభనేని వంశీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలోనే గన్నవరం నుంచి టీడీపీ టికెట్ కోసం కనీసం అరడజను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారట. టికెట్ నాకంటే నాకంటూ తమలో తామే కొట్టుకునే పరిస్తితికి వచ్చారు. దీనికి అసలైన కారకులు చంద్రబాబే అని చెప్పాలి. అలా ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయకపోవడమే.. బాబు చేస్తున్న అతి పెద్ద తప్పు అని అక్కడి తెలుగు తమ్ముళ్ళే అంటున్నమాట. ఈ నేపథ్యంలోనే గన్నవరంలో వంశీపై పోటీ చేస్తా.. చేసి గెలుస్తానంటూ.. పట్టాభి కూడా సవాల్ చేశారు. అంతేకాదు రెచ్చగొట్టి చివరికి జైలు పాలయ్యారు. పట్టాభి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇక్కడి టిడిపి ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో.. పార్టీ పనులకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పట్టాభి సైతం గన్నవరం సీటును ఆశిస్తున్నారని లోకల్ టాక్. సో.. వల్లభనేని వంశీని ఓడించడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. మరి చంద్రబాబు గన్నవరం టిడిపి ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికి కట్టబెడతారో చూడాలి.