ఉండవల్లి శ్రీదేవి భర్తపై సీఐడీ కేసు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఇంకా తగ్గలేదు. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడిపి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే ఉండవల్లి శ్రీదేవి టాపిక్ పలు రకాల చర్చలకు దారి తీస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా.. మరో వార్త ఉండవల్లి శ్రీదేవికి ఇబ్బందికరంగా మారింది. ఉండవల్లి శ్రీదేవి తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి ఆరోపించారు. శ్రీదేవితో పాటూ ఆమె భర్త డాక్టర్‌ కమ్మిలి శ్రీధర్‌ 2017లో తన దగ్గర 12 లక్షలు తీసుకున్నారని.. వాటిని తిరిగి ఇప్పించాలని ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులు తనపై పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలని గూడూరుకు చెందిన రమణయ్య నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. తాను గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఉండవల్లి శ్రీదేవి భర్త శ్రీధర్‌కు పరిచయం చేశానని.. వారిద్దరు డాక్టర్‌ శ్రీధర్‌కు పద్మశ్రీ అవార్డు ఇప్పించేందుకుగాను కోటిన్నర అవుతుందని చెప్పారన్నారు. ఆ వ్యక్తులు అడ్వాన్స్‌ కింద 2017 జనవరి 29న.. 52 లక్షలు శ్రీధర్ నుంచి తీసుకున్నారన్నారని, కానీ అవార్డు ఇప్పించకుండా మోసం చేశారని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని శ్రీదేవి దంపతులు తన దగ్గర.. ఒకసారి 10లక్షలు, మరోసారి 2లక్షలు చేబదులుగా తీసుకున్నారన్నారు. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వకుండా తనపైనే తప్పుడు కేసులు బనాయించారని రమణయ్య పేర్కొన్నారు. నా డబ్బులు నాకివ్వమని డిమాండ్ చేస్తే.. చివరికి శ్రీదేవి నన్ను బూతులు కూడా తిట్టారని, దానికి సంబందించిన కాల్ రికార్డింగ్ లు తన వద్ద ఉన్నాయని రమణయ్య నాయుడు వెల్లడించారు. 2021 జనవరి 31న తన కేసు సీఐడీ కి ట్రాన్స్ఫర్ అయ్యిందని, సీఐడీ అధికారులు శ్రీదేవి దంపతులను విచారించి తనకు న్యాయం చేయాలని, వారివద్ద నుండి 12 లక్షలు తనకు ఇప్పించాలని
రమణయ్య నాయుడు మీడియాకు సంచలన నిజాలు చెప్పుకొచ్చారు. మరి ఈ ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవి దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.