కేసులు ఎత్తేసిన సీఎం జగన్

అమలాపురం ఘటనలతో సామాజిక విభేదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ చూపించారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం సమావేశం అయ్యారు.. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తరతరాలుగా అందరూ అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు సీఎం జగన్. అక్కడే పుట్టి.. అక్కడే పెరిగారని.. అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు.. వాటిని మరిచిపోయి మునుపటిలా కలిసిమెలిసి జీవించాలన్నారు.. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్నారు. దీనివల్ల అందరూ నష్టపోతారని.. అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో ఉండాలన్నారు.చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం అన్నారు. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, అందర్నీ ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నామన్నారు. అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్‌ బేసిస్‌ మీద పథకాలు అన్నీ ఇస్తున్నామని.. వాలంటీర్‌లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారన్నారు. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయమన్నారు.