దొంగ ఓట్లతో గెలిచానంటూ ఇటీవల కలకలం సృష్టించారు… రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత సిఎం జగన్ కి జేజే లు కొట్టి .. ప్రస్తుతం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. తన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చారు. తాజాగా రాపాక వరప్రసాదరావు చేసిన పని అందరి నోట మాట రాకుండా చేసిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఎవ్వరూ చేయని పని ఒకటి చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. బహుశా రాజకీయాలలో మునుపెన్నడు ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు.
రాపాక కుమారుడి వివాహానికి ముద్రించిన పెళ్లి పత్రిక ఇటీవల వైరల్ గా మారింది. ఇది సర్వత్రా అందరి దృష్టిలో పడింది. ఆ శుభలేఖపై సీఎం జగన్, ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. తమకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సిఎం జగన్, శ్రీమతి భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ రాపాక శుభలేఖలో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్ భారతి చిత్రాలను ఆకట్టుకునేలా ముద్రించారు. తద్వారా తన స్వామి భక్తిని రాపాక చాటుకున్నారు. తాను జగన్ కు వీరభక్తుడినని రాపాక చాటుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో సీఎం జగన్ జూన్ 7న అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి హాజరవుతారని తెలుస్తోంది. రేపు క్యాబినెట్ భేటీ అనంతరం సిఎం జగన్ రాపాక కుమారుడి వివాహానికి హాజరావుతారని సమాచారం.