జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్

ఈ నెల 3, 4 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తోంది. ఈ సదస్సు నిర్వహణతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభుత్వ వ్యూహం. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్లు నిర్వహిస్తూ పెట్టుబడిదారుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రానికి ఇవాళ ఓ పెట్టుబడిదారు భారీ పెట్టుబడితో పరిశ్రమ స్ధాపనకు ముందుకొచ్చారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నట్లు సీఎం ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం జగన్.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని త్రివేణీ గ్లాస్ ఎండీ వరుణ్ గుప్తా ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన సీఎం జగన్ కు వివరించారు.ఈ పరిశ్రమ ద్వారా 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరుణ్ వెల్లడించారు. దీంతో ఆయనకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్‌.రాజీవ్‌ కృష్ణ కూడా పాల్గొన్నారు.