టిడిపికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి.. వచ్చే ఎన్నికల్లో ఎలా చెక్ పెట్టాలో తెలియక టీడీపీ వ్యూహకర్తలు సతమతమవుతున్నారా..? గుడివాడలో కొడాలి కొమ్ములు విరిచే నాయకుడి కోసం టీడీపీ ఇంకా వెతుకుతూనే ఉందా..? కొడాలి నానిని ఢీ కొట్టే మొగాడు, మొనగాడు టిడిపి లో లేరా..? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కొడాలి నానీనే విజయం సాధిస్తారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గుడివాడ టిడిపిలో రాజకీయం పీక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జిగా రావి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఇంకేముంది వచ్చే గుడివాడ నుంచి ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని.. నియోజగవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ తెర వెనుక ఇంకేదో జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. గుడివాడలో వెనిగండ్ల రామును పోటీకి దింపాలనే అధిష్టానం యోచిస్తుందని ప్రచారం సాగుతోంది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము టీడీపీ నుంచి గుడివాడ టికెట్ ఆశిస్తున్నారు. అధినేత ఆశీస్సులు తనకి ఉన్నాయంటోన్న వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ నియోజకవర్గంలో అల్లుకుపోతున్నారు. మరోవైపు తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొడాలి నానిని ఢీకొట్టే ఆర్థిక స్థోమత రావి వెంకటేశ్వరరావుకి లేదని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోందని సమాచారం. ఈ ప్లాన్ ప్రకారం కులసమీకరణాలు, ఆర్థిక అండదండలు, జనంలో పలుకుబడి అన్నీ కలిసే అభ్యర్థులని వెతికే పనిలో ఉంది. చాలా రోజులుగా చాలామందిని పరిశీలించి ఎవరినీ ఎంపిక చేయలేని డైలమాలో ఉంది. ఇదే కొడాలి నానికి మరింత బలంగా మారిందని, గెలుపుపై ధీమా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన చంద్రబాబు గుడివాడకు రానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు బుధవారం గుడివాడలో పర్యటించారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గ ఇంఛార్జులతో కొనకళ్ల గురువారం ఉదయం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. అయితే.. రాముకు ఆ రెండు రోజులూ అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. సమావేశానికి కూడా పిలవలేదట. అంటే గుడివాడలో కూడా వర్గ విభేదాలు నెలకొన్నాయని చర్చ జరుగుతోంది. మరి ఆ రోజైనా బాబు గుడివాడ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటిస్తారో లేదో చూడాలి.