ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం. మరో వైపు అభివృద్దిపై రచ్చ. ఇలా రెండు ప్రధాన పార్టీలు సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేస్తూ.. రాజకీయాలలో హీట్ పెంచుతున్నారు.. ఆయా పార్టీల రాజకీయ నాయకులు. ఇదిలా ఉంటే.. పొత్తులపై అనేక రకాల విశ్లేషణలు, ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి కారణం.. బాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహించడమే. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం..? పొత్తులు పెట్టుకుంటే.. వైసీపీకి నష్టమా..? అని ఎన్నో రకాలుగా విశ్లేషణలు వస్తున్నాయి. అయితే.. పొత్తుల విషయంలో వైసీపీ సింగిల్గా ఎన్నికలకు వెళ్లడం ఫైనల్. కానీ, మిగతా పార్టీల సంగతి ఇంకా తెలాల్సి ఉంది. దీనిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గతం కంటే జనసేన బలం ఇప్పుడు పెరిగిందని ఆయన అభిప్రాయ వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని జోష్యం చెప్పారు. సీఎం కావడమే కాదు.. ఐదేళ్లు పవనే సీఎంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటే బీజేపీని కలుపుకొని వెళ్లడం మంచిదన్నారు హరిరామ జోగయ్య. బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల జనసేన పార్టీకి లాభమే తప్ప.. నష్టం ఏమీలేదన్నారు. కాపులంతా అన్ని వర్గాలను కలుపుకొని పవన్ కల్యాణ్ కు 100శాతం సహకరించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.