అవినాష్‌రెడ్డికి హైకోర్టు తీపికబురు

వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు అంశంపై ఎంపీ ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో.. తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు అవినాష్‌రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది . ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. మంగళవారం నాడు సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని, సునీత అభియోగాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తున్నాయని, వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి, వివేకా రెండో భార్య షమీం పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు జరపాలని అవినాష్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.ఇక వివేకా హత్య కేసు డైరీని షీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది సీబీఐ. 35 మంది సాక్షుల స్టేట్మెంట్లు, పది డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి అవినాష్ తండ్రిని కూడా సీబీఐ విచారించింది.