వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం అయోమయంలో పడ్డారనిపిస్తోంది. వైసీపీ ఎంపీగా ఉంటూ.. అదే పార్టీపై తిరుగుబాటు చేసి లేనిపోని తలనొప్పులు సృష్టించుకొని.. ఇప్పుడు ఏపీ రావడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గానికి రావడానికి కూడా వెనకాడుతున్నారు అంటే.. జగన్ సర్కార్ ఎంతలా భయపెట్టిందో అర్ధం చేస్కోవచ్చని ప్రధానంగా వస్తున్న మాటలు. అయితే.. రఘురామ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ.. తాజాగా రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాటిపై జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ, వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో రఘురామ ఆందోళన మొదలయ్యింది. ఈ నెల 24న జరిగే ఏపీ గవర్నర్ ప్రమాణస్వీకారానికి తాను హాజరైతే, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు.. ఈ నేపథ్యంలో వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చే అవాకాశం ఉంది. మరి ఈ విచారణలో తీర్పు రఘురామకు అనుకూలంగా వస్తుందో లేదో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.