ఏపీ రాజాకీయాలలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రతి నిత్యం తెరపైకి వస్తూనే ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు రిసర్వేషన్ కల్పిస్తామని 2019 ఎన్నికలకు ముందు ఏవైతే జగన్ హామీ ఇచ్చారో.. వాటిని నెరవేర్చాలని కాపు నాయకుడు హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇలానే టిడిపి ప్రభుత్వంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకోసం పోరాటం చేస్తే.. ఆయనను చంద్రబాబు ఘోరంగా అవమానించిన సన్నివేశం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. కాపులకు రిసర్వేషన్ లు కల్పించి మీ ఉదారతను చాటుకోవాలని ముద్రగడ ఇప్పటికి రెండు మూడు సార్లు కూడా లేఖలు రాశారు. ఇక ఈ నేపధ్యంలోనే.. హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను రద్దు చేశారు. చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో చేసిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చడం లేదని, ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యుడిగా పేర్కొంటూ ఆయనను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా తొలగించాలని పిటిషనర్ చేగొండి హరిరామజోగయ్యను హైకోర్టు ఆదేశించింది.