సొంత పార్టీలో ఉంటూ.. అదే పార్టీకి వెన్నుపోటు పొడిచిన ద్రోహి అంటూ.. వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మండిపడ్డారు. నమ్మకద్రోహి అంటూ.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలో
హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె దిష్టిబొమ్మ దాహనానికి వైసీపీ కార్యకర్తలు యత్నం చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీసు ముందు ఉన్న ఫ్లెక్సీలు చించివేసి.. శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ఆమె కార్యాలయానికి పోలీసులు బలగాలు బారీగా మోహరించి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలోనే కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో శ్రీదేవి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌తో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ అధిష్టానం వీరిని పార్టీ నుండి సస్పెండ్ కూడా చేసింది.
నా గుండెను కొస్తే జగన్ ఉంటారని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు టిడిపికి మద్దతు తెలపడంపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. అయితే నిన్న అలా చెప్పుకొచ్చిన శ్రీదేవి.. తీరా పార్టీ నుండి సస్పెండ్ చేసిన క్రమంలో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె పెద్ద మహానటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి.