చంద్రబాబు మేనిఫెస్టో పేజ్ – 1 రాష్ట్ర రాజకీయాలలో మంటలు పుట్టిస్తుంది. చంద్రబాబు ప్రకటించిన హామీలన్నీ సంక్షేమానికి సంబందించిన హామీలే. ఒకప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన కూడా అదే బాటలో నడుస్తున్నారు.
కానీ, అసలు చెప్పిన మాట అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదంటూ.. గత అనుభవాలను వివరిస్తూ వైసీపీ ప్రచారం ప్రారంభించింది. సంక్షేమంలో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఈ 48 నెలల కాల పాలనలో 98 శాతం హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సంక్షేమంలో మహిళలకే అగ్రపీఠం వేసారు. ప్రతీ పథకంలోనూ మహిళలనే లబ్దిదారులను చేసారు. సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల 15 వేల కోట్లు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసారు. 2014లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవటం పైన జగన్ ప్రధానంగా ప్రచారం చేసారు. తన పైన అటువంటి ప్రచారానికి ఆస్కారం లేకుండా పాలన సాగించారు. ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన ఉప ఎన్నికలు..స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పడు వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ ఒంటరి పోరాటానికి సిద్దమయ్యారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం గెలిపిస్తుందని నమ్ముతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని స్పష్టం చేస్తున్నారు.
ఇక, పాలనా పరంగా వాలంటీరు వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కంటే మిన్నగా తీర్చిదిద్ది ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు-నేడు ద్వారా ఆధునీకరించడంతోపాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. అర్హతే ప్రమాణికంగా, వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విశాఖలో సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలి వచ్చారు. రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇక, ఇప్పుడు వై నాట్ 175 నినాదంతో జగన్ రానున్న ఎన్నికల్లొ మరో సారి విజయం సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.