రఘురామను చితకబాదిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్ జగన్ బొమ్మపై గెలిచి ఆ పార్టీతోనే విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో వైసీపీ సర్కార్ రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో సమాజంలో కులాలు, వర్గాల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ గతంలో కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం, దాన్ని కోర్టులు నిర్ధారించడం కూడా జరిగిపోయింది.దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన ఈ కేసు విచారణలో సీబీఐకి హైకోర్టు తాజాగా
కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ లాయర్ విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐకి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రఘురామపై కస్టడీలో హింస జరిగిన సమయంలో నమోదైన కాల్ డేటా ఈ కేసులో కీలకమని ఆయన లాయర్ వాదించారు. ఈ డేటా నమోదైన రెండేళ్లు మాత్రమే ఉంటుందని లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో కాల్ డేటా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామకృష్ణం రాజు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించారు.