ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి సవాళ్లు విసురుతున్నారు. కోటంరెడ్డికి దమ్ముంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైసీపీ చేసిన సవాల్ కి కోటంరెడ్డి అంతే ధీటుగా తన సవాల్ ను విసిరారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాళ్లు రాజీనామా చేస్తే తాను కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా కోటంరెడ్డి వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రెకార్డింగ్ అని కోటంరెడ్డి స్నేహితుడు చెప్పినప్పటికీ.. కోటంరెడ్డి మాత్రం ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని వెనక్కి తీసుకోవట్లేదు. నిండా మునిగిన తర్వాత చలేంటి అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే నెల్లూరు రూరల్ స్థానానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించి.. ఆయనకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఓటమి ఖాయం అంటూ ఆదాల కోటంరెడ్డికి ఛాలెంజ్ చేశారు. తనకు అధికారం అనుభవించి బయటకి వెళ్లడం ఇష్టం లేదని చెప్పుకోవడం కాదు.. దమ్ముంటే రాజీనామా చేసి చూపించు అంటూ వైసీపీ నాయకులు కోటంరెడ్డికి సవాల్ చేస్తున్నారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్న కోటంరెడ్డి దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ నాయకత్వం ఏం చేస్తుందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఇక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని తేల్చేశారు కోటంరెడ్డి. వైసీపీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తేనే తాను రాజీనామా చేస్తానని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి చివరకు ఏం జరగబోతుందో అనేది.