ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడిప్పుడే కోటంరెడ్డి చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. కోటంరెడ్డి చంద్రబాబును కలిసింది నిజం అని కూడా తేటతెల్లం అవుతుంది. నేను టిడిపి నుంచి పోటీ చేస్తా అంటూ.. ఏ నమ్మకంతో బహిరంగంగా చెప్పారు..? చంద్రబాబును కలవకుండానే ఈ ప్రకటన చేశారా..? అంటూ పలు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. పైగా నేను టిడిపికి అస్సలు టచ్ లో లేనంటూ కాకమ్మకధలు చెప్పడం.. చెవిలో పూలు పెట్టినంత సులువు కాదు కోటంరెడ్డి అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. పార్టీలో నమ్మకంగా ఉంటే.. ఈ తంతు అంతా ఎందుకుంటుంది చెప్పండి అంటూ.. రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు విసురుతున్నారు. అసలు అమరావతి రైతులు నెల్లూరు వస్తే వారిని కలవడం తప్పా.. అంటూ కోటంరెడ్డి తనను తాను సమర్ధించుకోవడం.. ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి అన్న చందాన ఉందని విశ్లేషకులు చలోక్తులు విసురుతున్నారు. అమరావతి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారు అంటే.. ఆయన చంద్రబాబుకు టచ్ లో ఉన్నట్టేనని చాలా స్పష్టంగా అర్ధమవుతుందని కూడా అంటున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేస్తానని చెప్పుకున్న కోటంరెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడిందని అంటున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. దీంతో ఆయన పరిస్థితి.. “పుట్టింటోళ్ళు వదిలేశారు నమ్ముకున్నోళ్లు తరిమేశారు “.. అన్న విధంగా మారిందని అంటున్నారు. కటకట.. ఇంతకష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ.. సెటైర్లు వేస్తున్నారు.. వైసీపీ నాయకులు. ఆయన వచ్చే ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నారట నెల్లూరు రూరల్ తెలుగు తమ్ముళ్ళు. కోటంరెడ్డిని టిడిపిలోకి రానివ్వవద్దు అంటున్నారట తమ్ముళ్ళు. అతనిని పార్టీలోకి రానిస్తే తమ పరువు పోతుందని.. చంద్రబాబు వద్ద మొరపెట్టుకుంటున్నారట. నేడు అధికార పార్టీపై తిరుగుబాటు చేసిన వ్యక్తి.. రేపు మన పార్టీపై కూడా తిరుగుబాటు చేయరని ఏంటి నమ్మకం అంటూ ప్రశ్నిస్తున్నారట. మరి ఈ పరిస్థితుల్లో కోటంరెడ్డి ఏం చేయాలా అన్న డైలమాలో పడ్డారట. అందుకే కాబోలు ఉన్నపళంగా నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించింది అంటున్నారు. ఒకవేళ కోటంరెడ్డికి గనుక టిడిపి ఛాన్స్ ఇవ్వకపోతే.. ఆయన ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.