జెండా ఊపిన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపధ్యంలోనే.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రధాని జెండా ఊపడంతో ప్రయాణం మొదలు పెట్టింది. ఫ్లాట్‌ఫాంపై ఉన్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. అంతకు ముందు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ప్రధాని ప్రస్తుతం ప్రారంభించిన వందే భారత్ 13వ రైలు అని అధికారులు తెలిపారు. ఈ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనుంది.
పరేడ్ గ్రౌండ్స్ సభావేదిక పైనుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. సభావేదికపైకి ప్రధానిని ఆహ్వానించి, ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని హైదరాబాద్ కు వచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించగా.. అందులో రెండు రైళ్లు మన రాష్ట్రానికే వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ కు బయల్దేరి వెళ్లారు.