ఎంపీ కేశినేని నాని ఔట్ షాకిచ్చిన టీడీపీ

బెజవాడలో టిడిపికి ఏమైంది..? ఒకప్పుడు బెజవాడ కంచుకోటగా ఉన్న టిడిపి.. ఇప్పుడు ఎందుకు పట్టు కోల్పోతుంది…? ఆధిపత్యం కోసం తమలో తామే కయ్యానికి కాలు దువ్వుతున్నారా..? సొంత పార్టీ నేతలె.. వెన్నుపోటు పొడుస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.వచ్చే ఎనికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తోంటే.. టిడిపి నాయకులు మాత్రం వర్గ పోరుతో పార్టీపరువు తీసిపడేస్తున్నారు.వైఎస్ఆర్సీపీ మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..ఇందులో పాల్గొంటోన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికిస్తోన్నారు. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. విజయవాడలో జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను అంటించిన ప్రతి ఇంటి వద్దా ఈ రెండు పార్టీల స్టిక్కర్లు వెలుస్తోన్నాయి. సైకో పోవాలి- సైకిల్ రావాలి- మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలి అనే స్లోగన్‌తో తెలుగుదేశం పార్టీ నాయకులు స్టిక్కర్లను తయారు చేశారు. వాటిని విజయవాడలో ప్రతి ఇంటికీ అంటిస్తోన్నారు.

ఈ పరిణామాలతో విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. స్టిక్కర్లను అతికించే కార్యక్రమం విజయవాడ పరిధిలో పోటాపోటీగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లల్లో విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఫొటో మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫొటోను ముద్రించారు ఇందులో. ఓ వైపు స్థానిక శాసన సభ్యుడి ఫొటో, మరో వైపు కేశినేని చిన్ని ఫొటోను ముద్రించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఎంపీ కేశినేని నాని ఫొటో లేకపోవడం చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఆయనను దూరం పెట్టిందనడానికి ఇదే సాక్ష్యంగా తీసుకోవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నికి విజయవాడ లోక్‌సభ టికెట్‌ను కేటాయించడం కూడా ఖాయమైందనే విషయాన్ని ఈ స్టిక్కర్ల ద్వారా స్పష్టం చేసినట్టయింది. మరి ఈ విషయంపై ఎంపీ కేసినేని నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.