గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేయడమే కాకుండా.. వాహనాల తగులబెట్టి, ధ్వంసం చేశారని..
కొమ్మారెడ్డి పట్టాభి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని.. తనను ఫిజికల్‌గా టార్చర్ చేశారని పట్టాభి తెలిపారు. జిల్లా ఎస్పీ జాషువా, ఆయన కింద పని చేసిన అధికారులు తమపై దాడి చేస్తుంటే ఎక్కడా అదుపు చేయకుండా తిరిగి టీడీపీ నేతలనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు చేత 30 నిమిషాల పాటు తనను భౌతికంగా హింసించారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారన్నారు. కుటుంబ సభ్యులను కూడా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్ని సంఘటనలను కమిషన్ సభ్యుడు రాజీవ్‌కు వివరించామని చెప్పారు. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి భౌతికంగా ఏ విధంగా ఇబ్బందుల గురి చేశారనే అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేసిన కమిషన్ సభ్యులు.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తమకు భరోసా ఇచ్చారన్నారు.తాను ఏ రోజూ భయపడి వెనక్కి పోయే వ్యక్తిని కాదని.. ఈ అంశంపై పోరాటం చేస్తానని పట్టాభి తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ తరఫున లేఖ రాస్తామని చెప్పారన్నారు. పోలీసు అధికారులు ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదని వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.