ఏపీలో పొత్తులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ గనుక బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే.. ఓటమి ఖాయమని
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ లక్ష్యం లేకుండా వెళుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవంగా బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని, అప్పుడు వైసీపీని ఓడించడం కష్టంగా మారుతుందని చెప్పారు. బీజేపీతో కలిస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం లేదన్నారు. ఆ పార్టీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళతానంటే ఫలితం ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, విభజన చట్టాలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ఒక కూటమి కావాలన్నారు. దానిలో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం ఉంటేనే వైసీపీపై విజయం సాధ్యమని నారాయణ అభిప్రాయపడ్డారు. పవన్ పులిపై సవారీ చేస్తున్నారని, చంద్రబాబునూ ఆ పులిపై సవారీకి ఆహ్వానిస్తున్నారని విశ్లేషించారు. అయితే చంద్రబాబు ఆ పులిపై ఎక్కుతాడో లేదో తెలియడం లేదన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ- వామపక్షాలు పరస్పర అవగాహనతో సహకారం అందించుకున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్టను టీడీపీకి వేసేలా ఒప్పందం చేసుకున్నాయి. టీడీపీకి ఆ ఒప్పందం కలిసి వచ్చింది. ఉత్తరాంధ్రతో పాటుగా సీమలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుచుకుంది. మరి ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.