ఏపీలో పొత్తుల రాజకీయాలు డైలీ సీరియల్ లా సాగుతున్నాయి. హోటల్ లో భేటీ అవుతారు.. ప్రెస్ మీట్ పెడతారు.. చివరికి అసలు విషయాన్ని దాటేస్తారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మధ్య నిత్యం జరిగేది ఇదేనని… వారి మధ్య పొత్తుల డీల్ కూడరకనే ఇలా కవర్ చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ఏపీ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అన్న అంశాన్ని తేల్చే సమయం రానే వచ్చింది.
మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ లోగా ఎన్నికలు..కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ..టీడీపీ..బీజేపీ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వైసీపీ అందరి కంటే ముందుగానే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఇక టీడీపీ తమ అభ్యర్ధిని ప్రకటించడంలో వెనకాడుతోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ తిరిగి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలో బీజేపీ – టీడీపీ రెండు పార్టీలు విడివిడిగా బరిలో నిలిచాయి. సరిగ్గా పవన్ కూడా ఇక్కడే దొరికేశాడు. మరి పవన్ ఎవరికి మద్దతిస్తారు. జనసేన మద్దతు దారులకు ఎవరు ఓటు వేయమని పిలుపునిస్తారు అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఈ ఎన్నికలకు జనసేన నేరుగా పోటీ చేసే సూచనలు అయితే కంపించడంలేదు. వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ పదే పదే చెప్తున్నారు కూడా. అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలని యోచనలో ఉన్నారని అంటున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పేసింది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయం బీజేపీ కి కూడా తెలిసిపోయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పవన్ మద్దతు కోరేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. దీని ద్వారా వ్యూహాత్మకంగా పవన్ ను ఇరుకున పెట్టే ప్రయత్న చేస్తోంది. పవన్ బీజేపీకి మద్దతిస్తారా.. లేక టీడీపీ కోసం మౌనంగా ఉంటారా అనేది తెలుసుకోవటం కోసమే బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. బీజేపీ ప్లాన్ కి చంద్రబాబుకి టెన్షన్ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎవరికి తమ మద్దతు ప్రకటిస్తారో చూడాలి.