భీమవరం శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఈ మధ్యే ఓ దినపత్రిక ప్రచురించగా.. దానిపై ఇప్పటివరకు స్పందించలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తే- ఆవేశంతో ఊగిపోయే పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్ అనేది తేలిపోతోందని అన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకులు రాజకీయాలకు పనికి రారని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ తెలియట్లేదని ఎద్దేవా చేశారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం పేరు వినిపిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ కు తెలియట్లేదని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు చెబితే గానీ తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకునే స్థితిలో లేడని ఎద్దేవా చేశారు. కాకినాడ, కాకినాడ రూరల్, భీమవరం, పిఠాపురం, కైకలూరు, తాడేపల్లిగూడెం.. ఇలా ఎన్నో నియోజకవర్గాల పేర్లు బయటికి వస్తోన్నాయని చెప్పారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు లేదని విమర్శించారు.
భీమవరం, గాజువాక ఓటర్లు కొట్టిన దెబ్బకు పవన్ కల్యాణ్ వణికిపోతున్నాడని, సింగిల్ గా పోటీ చేయడానికి భయపడుతున్నాడని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. సింగిల్ గా పోటీ చేయడం అంటే వీరమరణం పొందడమేనంటూ పవన్ కల్యాణ్ నేరుగా అంగీకరించాడని గుర్తు చేశారు. ఈ దెబ్బకు పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోటీ చేయలేడని, చంద్రబాబు నాయుడు వద్దన్నా ఆయనతోనే పొత్తు పెట్టుకుంటాడని అన్నారు.