కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విడుదల చేసిన లేఖ.. ఏపీ రాజకీయాలలో కాక రేపుతోంది. ఉద్యమాలే ఊపిరిగా, కాపులకు న్యాయం జరగాలని చివరికి కుటుంబంతో సహా వీధిన పడ్డా ఏమాత్రం సిగ్గుపడకుండా, అధైర్యం చెందకుండా అక్రమ కేసులు ఎదుర్కొని తాను నమ్ముకున్న కాపు సామాజిక వర్గ ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి.. ఆవేదనతో ఓ లేఖ రాశారు. నేను రాజకీయాలలోకి వచ్చింది పదవుల కోసమో, ఆస్తులను కూడబెట్టుకోవడం కోసమో కాదు.. ప్రజలకు న్యాయం చేసేందుకే రాజకీయాలలోకి వచ్చా అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను పాడు చేయమని ఎప్పుడూ చెప్పలేదని లేఖలో పేర్కొన్నారు. తమ జాతి రిజర్వేషను జోకర్ కార్డులాగ అయినందుకు బాధపడుతున్నానంటూ.. ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు తన రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. ముద్రగడ చెప్పిన ఆ ఒక్క మాటతో ఏపీ రాజకీయాలలో మరింత ఆజ్యం పోసుకుందని చెప్పాలి. రాజకీయాల పట్ల ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ముద్రగడ ఇప్పుడు ఉన్నపలంగా తన రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని చెప్పడంతో వైసీపీకి ఆశలు చిగురించాయని చెపాలి. ఎందుకంటే.. దానికి పెద్ద కథే ఉంది. గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి 2016లో ఎన్నో అవమానాల పాలయ్యారు. అంతేకాదు అనేక అక్రమ కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళమని కూడా కొందరు ఆయనకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన తమ కాపు సామాజిక వర్గం కోసం ధైర్యంగా నిలబడ్డారు. అయితే.. నాడు తుని రైలు దగ్దం ఘటనలో ఆయనపై అనాయ్యంగా కేసులు పెట్టింది నాటి టిడిపి ప్రభుత్వం. తాజాగా ఆ కేసులో ఆయనతో పాటు మరికొందరు కాపు నేతలు అలానే దాడిశెట్టి రాజాలకు ఊరట లభించింది. ఈ కేసులో తుది తీర్పు రావడానికి సిఎం జగన్ తెర వెనుక కథ నడిపించారని ప్రచారం సాగింది. అయితే.. ముద్రగడను వైసీపీ నేతలు గతంలోనే తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఆయన తన రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని పేర్కొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలో వైసీపీ లోకి వెళ్ళడం ఖాయ౦ అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.