పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన.. బాబుకి షాక్..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సీఎం జగన్ రెండుసార్లు ఢిల్లీ బాట పట్టగా..ఆ తర్వాత ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు మరికొందరు బీజేపీ పెద్దలతోనూ పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వెంట ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరి పర్యటన రాజకీయంగా పలు ఊహాగానాలకు దారి తీసింది. జనసేనాని ప్రధానంగా ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై కమలదళం పెద్దలతో చర్చిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనకు సహకరించడం లేదని పవన్ అన్నారు. దీనికితోడు ఏపీ బీజేపీ నేతలతో పవన్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు పేరుకే అన్నట్లుగా ఉందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత ఢిల్లీ టూర్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి చంద్రబాబుతో పొత్తుకు బీజేపీని ఒప్పించే బాధ్యత పవన్ తీసుకుంటారని కూడా అంటున్నారు. అయితే టిడిపి తో పొత్తుకై బీజేపీ సానుకూలత చూపదని రాజాకీయ విశ్లేషకులు తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి బీజేపీతో మాకు పొత్తు ఉందని చెప్పిన ఆయన..టీడీపీకి కూడా అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.