పరారీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం..అరెస్టుకు ఆదేశించింది. ఈ మేరకు.. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సూర్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.వాణిజ్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి ఉద్యోగులు గండికొట్టారని ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఏ -5గా సూర్యనారాయణను చేర్చారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని సూర్యనారాయణ శుక్రవారం ఉదయం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఫోన్లు సైతం వదిలేసి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగులను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలోనూ ఆయన కోర్టు వద్దకు వచ్చారు. అప్పుడే ఈ కేసులో తనపేరూ చేర్చారని తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.