సమాజంలోని అన్ని వర్గాల వారిని వంచించాక ఇప్పుడు ‘నువ్వే మా నమ్మకం జగనన్న అని ఎవరైనా అంటారా?’ అన్నారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఉద్యోగలకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందడం లేదని.. ఏ ఒక్క లబ్ధిదారునికి ఇంటిని నిర్మించి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యను దూరం చేసి.. నాలుగేళ్ల పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయకుండా, ఇప్పుడు అమలు చేస్తామంటే ప్రజలు విశ్వసిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను ఇంకా మోసం చేయవచ్చుననే భ్రమలలో నుంచి.. గారడీ విద్యల నుంచి తమ పార్టీ పెద్దలిప్పటికైనా బయటికి రావాలన్నారు.
పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తన పేరిట ఏర్పాటు చేయదలచిన జగనన్న కాలనీలలో బస చేయాలని సూచించారు. జగనన్న కాలనీలలో ముఖ్యమంత్రి బస చేస్తేనైనా రోడ్డు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు ఆయా కాలనీలలో ఏర్పడతాయన్నారు. ఏమీ లేని దాన్ని ఉందనుకొని ‘వై నాట్ 175 అని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని’ రఘురామ అన్నారు. జగనన్న కాలనీలలో బస చేస్తే పబ్లిక్ పల్స్ అర్థమవుతుందని అన్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని.. నాలుగేళ్లైనా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వలేదన్నారు.
30 లక్షల మందికి ఇళ్లను ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇంటి స్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేశారన్నారు. అందులోనూ ఓ ఏడు ఎనిమిది లక్షల మంది తమ పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చి పట్టాలను కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని తెలిపారు. పాలకొల్లులో చంద్రబాబు హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందచేయకపోవడం దారుణమన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు అందజేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలను మాత్రమే అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 30,000 రూపాయలతో 450 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. ఇప్పటికిప్పుడు ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలను రద్దు చేసి, ప్లాట్ లను వెనక్కి తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామే కష్టపడి ఇల్లు కట్టుకున్న ప్రజలు తాను ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసినంత మాత్రాన లబ్ధిదారుల మనుషుల్లో చోటు సంపాదించుకోవడం కష్టమన్నారు.