వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్దుల ఖరారుపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచే అభ్యర్ధులను బరిలోకి దించాలని అటు అధికార పార్టీ.. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పక్కా ప్లాన్ ల మీద ఉన్నాయి. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో యువతకే టిక్కెట్స్ ఇవ్వాలని రెండు పార్టీలు యోచిస్తున్నాయి. ఇక రెండు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు తమ వారసులకే టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీల అధిష్టానాన్ని అభ్యర్ధిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా తన మనసువిప్పి ఓ మాట చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తేల్చి చెప్పారు. తన కుమారిడికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. ఇప్పుడు చంద్రగిరిలో కుమారుడు మోహిత్ రెడ్డిని నిలబెట్టాలని చెవిరెడ్డి చూస్తున్నారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీ గా కొనసాగుతున్నారు. చంద్రగిరి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తన కుమారుడికి సీటుకు సంబంధించి సీఎం జగన్ నుంచి చెవిరెడ్డి హామీ పొందారని ప్రచారం సాగుతోంది. పార్టీలో వారసులకు టికెట్ల కేటాయింపు అంశం పైన భారీ లిస్టు సీఎం జగన్ వద్ద పెండింగ్ ఉంది.
ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సైతం తమ వారసుడికి సీటు ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం. ఆయన కుమారుడు కూడా తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. మరి చూడాలి సిఎం జగన్ వారసులకు టిక్కెట్స్ ఇస్తారో లేదో అనేది.