తాను ఒకప్పుడు బెంజ్ కారులో తిరిగేవాడినని, చంద్రబాబును నమ్మి తన సంపాదన అంతా పార్టీ కోసం ఖర్చు పెట్టించి చివరకు డొక్కు కారులో తిరిగే స్థాయికి తెచ్చారని ఆ పార్టీ రెబల్ నాయకుడు జయమంగళ వెంకట రమణ చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవల టీడీపీలో నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వెంటనే ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న కైకలూరు నియోజకవర్గ నేత జయమంగళ వెంకట రమణ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకట రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కైకలూరు నుంచి తానే గెలుస్తానని అయినా చంద్రబాబు వెంకయ్య నాయుడు కలసి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కు కైకలూరు సీటు ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందు తనను నామినేషను దాఖలు చేయాలని కోరారన్నారు. అయితే తరువాత బిజెపితో టిడిపి పొత్తు ఉందని కైకలూరు స్థానాన్ని బిజెపి అభ్యర్థికి వదిలివేయాలని తనను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు.
ఇలా చంద్రబాబు తనతో డబ్బు ఖర్చు పెట్టించి తనకు ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. కేవలం తన నియోజకవర్గానికే కాకుండా పొరుగు నియోజకవర్గానికి చాలా డబ్బు ఖర్చు చేశానన్నారు. తాను బీసీని అయినా టీడీపీ పట్టించుకోలేదన్నారు.తన రాజకీయ ప్రస్థానాన్ని 1999లో ప్రారంభించానని జయమంగళ వెంకట రమణ తెలిపారు. ఆ సమయంలో తన సంతానానికి కూడా సరిపోయే అనేక ఆస్తులు ఉన్నాయన్నారు. టీడీపీ వాళ్లు జెడ్పీటీసీగా చేస్తానని చెప్పగా తాను అంగీకరించానన్నారు. అప్పటి నుంచి 2006 వరకు జెడ్పీటీసీగా ఉన్నానని తెలిపారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి తన నియోజకవర్గానికి, పక్క నియోజకవర్గానికి కూడా ఖర్చు చేయాలని కోరారన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచానన్నారు. 2014లో కామినేని శ్రీనివాస్ కు సీటు కేటాయించి తనకు అన్యాయం చేశారని వాపోయారు.ఇక 2019లో ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు తన భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని జయమంగళ వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్ళు తనను వెన్నుపోటు పొడవడంతో ఓడిపోయానన్నారు.