మరో వివాదంలో సింగర్ మంగ్లీ..

ప్రముఖ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని పది రోజుల క్రితం ఆలయంలో ఓ పాటను మంగ్లీ బృందం చిత్రీకరించింది. అయితే కాలభైరవ స్వామి వద్ద అలాగే అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ బృందం నృత్యాన్ని షూట్ చేశారు. రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ ఆటపాట సాగింది. ఈ క్రమంలోనే పలువురు భక్తులు ఆమెపై మండిపడుతున్నారు.

అసలు ఈ షూటింగ్ కి ఎవరు అనుమతి ఇచ్చారంటూ పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిషేధం విధించిన చోట ఆమెకు పాట చిత్రీకరణకు ఎలా పర్మిషన్ ఇస్తారని భక్తులు అంటున్నారు. అయితే మంగ్లీ పాట కోసం రాష్ట్ర దేవాదాయశాఖ నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం అందుతోంది. అయితే చాలా ఏళ్లుగా ఆలయం లోపల ఈ ప్రాంతాలలో వీడియో చిత్రీకరణ పై నిషేధం విధించారు. ఇప్పుడు మంగ్లీ ఆ ప్రాంతాల్లో పాటను షూట్ చేయడం వివాదానికి తెరలేపింది. మంగ్లీ పాటకు ఎవరు అనుమతి ఇచ్చారు అన్నదానిపై తాజా వివాదం నెలకొంది. తెల్లవారుజామున ఆలయం లోపల ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మంగ్లీ షూట్ చేసిన శివారత్రి పాట వైరల్ అవుతోంది.