స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై డొంక కదులుతుందా..? ఈ స్కాంలో అసలు సూత్రదారులు ఎవరు..? ఈ స్కాంకి ఎవరు సపోర్ట్ చేశారు..? వారికి కూడా శిక్ష తప్పదా..? అంటే అవుననే అంటున్నారు.. పలువురు రాజకీయ నాయకులు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. ఏపీఎస్డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు రెండు రోజుల క్రితం సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే అర్జా శ్రీకాంత్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఇదే స్కాంలో మరో కీలక వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడలోని కోర్టులో హాజరుపరుస్తారు. జీవీఎస్ భాస్కర్ తో సహా ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ 8 మందిని అరెస్టు చేసింది. ఆయన భార్యకే ఏపీఎస్ఎస్ఓసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు కూడా కల్పించారు. ఈ కేసులో షెల్ కంపెనీలను సీఐడీ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ విషయంలో మనీలాండరింగ్ చోటుచేసుకుందనే అనుమానంతో విచారణ చేయాలని ఈడీకి సీఐడీ అధికారులు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. 2022 డిసెంబర్ మాసరంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర వుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే అందరి తప్పులు బయటకు వస్తాయని, చంద్రబాబు, లోకేశ్ కూడా బొక్కలోకి పోవడం ఖాయమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెలాంటి ట్విస్ట్ లు తెరపైకి వస్తాయో చూడాలి.