టీడీపీ మహిళా నేత అరెస్ట్ నాడు పట్టాభి చేసిన రచ్చ

తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఫిబ్రవరి 20న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య జరిగిన గొడవలో కల్యాణిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా వుండేందుకు ఆమె ముందస్తు బెయిల్ కు ప్రయత్నించింది. అయితే బెయిల్ లభించకపోవడంతో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు కల్యాణి అజ్ఞాతంలో వుంటోంది. కల్యాణి కోసం గాలిస్తున్న పోలీసులకు హనుమాన్ జంక్షన్ లోని నివాసంలో వున్నట్లు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున పోలీసులు ఇంటిని ముట్టడించి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ మహిళను బెడ్రూం లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. కనీసం నైట్ డ్రెస్ కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని కల్యాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు అడ్డుకున్నప్పటికీ కల్యాణి బెడ్రూంలోకి వెళ్ళిమరీ పోలీసులు అరెస్ట్ చేసారు.

ఫిబ్రవరి 20నన గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో అప్పుడే టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై దాడి జరిగిన నేపధ్యంలో పట్టాభి పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘర్షణ కేసులో మరికొందరు టిడిపి నేతలపైనా పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇలా మహిళా నాయకురాలు కల్యాణిపై కూడా పోలీసులు రెండు కేసులు నమోదు చేసారు. తాజాగా ఈ కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయడం రాజకీయ అలజడి రేపుతోంది.