గత రెండేళ్ల కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ ప్రయివేటీకరణను అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సీఎం జగన్ ఇదే అంశం పైన ప్రధానికి లేఖలు కూడా రాశారు. ఈ తరుణంలోనే.. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా కొద్ది రోజులుగా కొత్త రాజకీయం మొదలైంది. ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని నిర్ణయించింది. ఈ సమయం లో ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. జగన్ ప్రభుత్వం తాము ప్రయివేటకరణకు వ్యతిరేకమని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ప్రధానితో సహా కేంద్రానికి ఇచ్చిన నివేదికలను ప్రస్తావిస్తోంది. ఈ సమయంలోనే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేసారు. దానికంటే ముందు అర్ ఎన్ ఐ ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం వరుసగా కేంద్రంతో, స్వయంగా ప్రధానితో చేసిన సంప్రదింపుల కారణంగానే కేంద్రం పునరాలోచన చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.